Southwest Monsoon: ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చేదువార్త అందించింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుందని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గిందని తెలిపింది. జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనుంది.
శ్రీలంక వద్దే నిలిచిపోయిన పవనాలు: సాధారణంగా మే 25 నాటికే తమిళనాడు దక్షిణ ప్రాంతాన్ని తాకాల్సిన రుతుపవనాలు.. ఎల్‌నినో పరిస్థితుల వల్ల మందగించాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు ప్రస్తుతం శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. సాధారణ షెడ్యూల్ ప్రకారం మే చివరి నాటికి ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జూన్ 5 నుండి 10వ తేదీల మధ్యే రుతుపవనాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
వర్షపాతంపై ప్రతికూల ప్రభావం: ఎల్‌నినో కారణంగా జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం వర్షపాతంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే స్పష్టం చేసింది. వర్షాలు ఆలస్యమైతే అటు తాగునీటికి, ఇటు వ్యవసాయ పనులకు ఇబ్బందులు తప్పవని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Also read-Telangana: నిప్పుల కుంపటిలా తెలంగాణ.. వడదెబ్బతో 51 మంది మృతి!
భానుడి భగభగలు: రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటేసి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

