HomeTop StoriesEbola Virus: ఎబోలా కలకలం..హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

Ebola Virus: ఎబోలా కలకలం..హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

Ebola Virus: ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola virus) మళ్లీ కోరలు చాస్తోంది. కాంగోతో పాటు పొరుగున ఉన్న ఉగాండా దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా ప్రకటించింది. కాంగోలో ఈ వైరస్ ధాటికి ఇప్పటివరకు 88 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మందికి పైగా ఎబోలా బారిన పడినట్లు స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన: 1976లో కాంగోలో ఎబోలా వైరస్‌ను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి.. అక్కడ ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం ఇది 17వ సారి కావడం గమనార్హం. ప్రస్తుతం కాంగోలో సేకరించిన ప్రాథమిక నమూనాలలో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదు కావడంతో పాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం వైద్య నిపుణులను కలవరపెడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ ఎబోలా స్ట్రెయిన్‌కు (Bundibugyo virus) ప్రత్యేకంగా ఆమోదించబడిన చికిత్సలు కానీ, వ్యాక్సిన్‌లు కానీ అందుబాటులో లేవు. దీంతో వైరస్‌ను తక్షణమే అరికట్టడం ఒక సవాల్‌గా మారిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు: ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలకు ప్రస్తుతానికి తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ.. కాంగో పొరుగు దేశాలకు ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని దేశాలు తమ జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను అప్రమత్తం చేయాలని కోరింది. సరిహద్దుల వెంబడి తనిఖీలు (స్క్రీనింగ్) ముమ్మరం చేయాలని సూచించింది. ఎబోలా లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు ప్రయాణాలు చేయరాదని హెచ్చరించింది. వ్యాధి నిర్ధారణ అయిన బాధితులను వెంటనే క్వారంటైన్ చేయాలని, వారితో ప్రాథమిక సంబంధాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో గట్టిగా సూచించింది. అయితే ఎబోలా భయంతో దేశాల సరిహద్దులను పూర్తిగా మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్యాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News