నంద్యాల,తెలుగుప్రభ: శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు రానున్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే నీటితో జిల్లాలోని మూడు రిజర్వాయర్లను తాగునీటి అవసరాల మేరకే నింపనున్నట్లు శనివారం తెలిపారు. ప్రస్తుత జలాశయాల్లోని నీటి నిల్వలు, అందుబాటులో ఉన్న నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని సాగునీటికి లేదా పంటలకు నీటిని అందించే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ప్రస్తుత నీటి లభ్యతను రైతులు, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కలెక్టర్ కోరారు.రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.తక్కువ నీటి లభ్యత పరిస్థితుల్లో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.ప్రాంతానికి అనుకూలమైన పంటల ఎంపికపై రైతులకు శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సహకారం అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
‘రైతన్నా నీకోసం – ఎల్‌నినో కాంబ్యాట్’
రైతన్నా నీకోసం – ఎల్‌నినో కాంబ్యాట్ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు, తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుపై ప్రతి రైతుకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిరంతరం సలహాలు, సూచనలు అందించాలన్నారు.జిల్లాలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కలెక్టర్ స్పష్టం చేశారు.
శ్రీశైలం నుంచి వచ్చే నీటిని సాగునీటికి కాకుండా కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించనున్నందున ప్రజలు, రైతులు నీటిని పొదుపుగా వినియోగించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికతో నీటి నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Also Read: Rayachoti: 20 నిమిషాల్లో రూ.10 లక్షల ఆభరణాల రికవరీ

