Andhra Pradesh: ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి అల్పపీడన ముప్పు పొంచి ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బీహార్ నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దానికి తోడు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొన్నారు.
ఈదురుగాలుల బీభత్సం: రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానికి తోడు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రైతులకు కీలక సూచనలు: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పలు జాగ్రత్తలను సూచించింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. వర్షం కురిసే సమయంలో పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందరాదని పేర్కొంది. అంతేకాకుండా వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉరుముల శబ్దం వినిపించగానే చెట్ల కిందకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.

