Sunil Bansal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక ఒక నిశ్శబ్ద వ్యూహకర్త కృషి దాగి ఉంది. ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. తృణమూల్ కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయడంలో బన్సల్ విజయవంతమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడైన ఆయన.. బెంగాల్ రాజకీయాల్లో కమల దళాన్ని పతాక స్థాయికి చేర్చారు.
అసలు ఎవరీ సునీల్ బన్సల్?: విద్యార్థి విభాగమైన ఏబీవీపీ (ABVP) ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సునీల్ బన్సల్.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ షాకు సహాయకుడిగా ఉండి ఉత్తరప్రదేశ్‌లో పార్టీ విజయానికి బాటలు వేశారు. ఆపై 2017, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన వ్యూహాలతో భాజపాను గెలిపించారు. ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సైతం పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లోను మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడానికి బన్సల్ సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆయన రచించిన చతుర్ముఖ వ్యూహమే బెంగాల్‌లో బీజేపీని గెలుపు దిశగా పయనించేలా చేసింది.
బెంగాల్‌లో విజయానికి దారితీసిన చతుర్ముఖ వ్యూహం:
1. బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడం: బన్సల్ వ్యూహాలు సామాన్య రాజకీయ నేతలకు అస్సలు అర్థం కావు. ఆయన పెద్ద బహిరంగ సభల కంటే క్షేత్రస్థాయి యంత్రాంగంపైనే ఎక్కువ నమ్మకం ఉంచారు. బెంగాల్‌లోని 80,000 పోలింగ్ కేంద్రాలకు గాను.. సుమారు 65,000 చోట్ల క్రియాశీలక బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక పన్నా ప్రముఖ్(ఇన్‌ఛార్జ్)ను నియమించి ఓటర్లతో నేరుగా సంబంధాలు నెలకొల్పారు.
2. అంతర్గత విభేదాల పరిష్కారం: మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ(TMC) నుంచి వచ్చిన నేతలు, పాత భాజపా కార్యకర్తల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని ఆయన చాకచక్యంగా సరిదిద్దారు. కేవలం గ్లామర్ కోసం వచ్చే సినిమా స్టార్ల కంటే క్షేత్రస్థాయిలో కష్టపడే వారికే టికెట్ల పంపిణీలో ప్రాధాన్యతనిచ్చి క్రమశిక్షణను కఠినతరం చేశారు. అందుకే ఈ సారి ప్రజల్లో నిత్యం ఉంటూ వారి సమస్యలపై పోరాడిన వ్యక్తులకే టికెట్లు కేటాయించారు.
Also Read-TVK Vijay: ‘తమిళ’నాట టీవీకే ప్రభంజనం.. విజయ్ ఇంటికి నటి త్రిష
3. భయం వీడండి.. నమ్మకంతో ఉండండి: బెంగాల్ ఎన్నికల హింసను ఎదుర్కోవడానికి కార్యకర్తల్లో ధైర్యం నింపేలా “Fear Not- Have Faith” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేంద్ర బలగాల మోహరింపుపై ఓటర్లకు అవగాహన కల్పించారు. అంతటితో ఆగకుండా వారు నిర్భయంగా ఓటు వేసేలా భరోసా ఇచ్చారు.
4. డేటా ఆధారిత రాజకీయం: ప్రతి నియోజకవర్గంలో కుల సమీకరణలతో పాటు స్థానిక సమస్యలపై లోతైన విశ్లేషణ చేశారు. టీఎంసీపై ఉన్న వ్యతిరేకతను, అవినీతి ఆరోపణలను ఎండగడుతూనే.. మహిళా ఓటర్లను ఆకర్షించేలా సంక్షేమ పథకాలపై బలమైన హామీలు ఇచ్చారు.
Also Read-Tamil Nadu: గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్.. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో టీవీకే!
ఎలక్షన్ ఇంజనీర్‌గా పేరున్న బన్సల్: తెరవెనుక ఉండి వ్యవస్థను నడపడంలో దిట్ట అయిన సునీల్ బన్సల్‌ను రాజకీయ వర్గాలు “ఎలక్షన్ ఇంజనీర్” అని పిలుచుకుంటాయి. బెంగాల్‌లో ఆయన రూపకల్పన చేసిన సంస్థాగత నిర్మాణం పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా భాజపాను ఒక బలమైన శక్తిగా నిలబెట్టింది.

