IPL Eliminator match: ఐపీఎల్‌లో మరో హై-వోల్టేజ్ సమరానికి వేదిక సిద్ధమైంది. బుధవారం జరగనున్న అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు చావో రేవో తేల్చుకునేందుకు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది.
భీకర ఫామ్‌లో సన్‌రైజర్స్: గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి ఈసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. చివరి 10 మ్యాచ్‌ల్లో ఎనిమిదింటిని గెలుచుకుని ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టులోకి వచ్చాక సన్‌రైజర్స్ రూపురేఖలే మారిపోయాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో ఆడిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ గెలవడం ఆ జట్టుకు మానసికంగా పెద్ద సానుకూలాంశం. అంతే కాకుండా సన్‌రైజర్స్ టాప్-4 బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారారు. క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పరుగులతో విధ్వంసం సృష్టిస్తున్నారు. బౌలింగ్‌లోనూ హైదరాబాద్ బలంగా ఉంది. ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కెప్టెన్ కమిన్స్, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ శివాంగ్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.
ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్ రాయల్స్: టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి దూసుకెళ్లిన రాజస్థాన్.. మధ్యలో కాస్త తడబడినా చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. రాజస్థాన్ టాప్ ఆర్డర్ కూడా చాలా బలంగా కనిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే 583 పరుగులతో చెలరేగిపోతున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు అతిపెద్ద సవాల్‌గా మారనున్నాడు. అతడు పవర్‌ప్లే వరకు క్రీజులో ఉంటే మ్యాచ్‌ను ఏకపక్షం చేయగలడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్‌కు ప్రధాన బలం. అతనితో పాటు బ్రిజేష్ శర్మ, బర్గర్, యువ లెగ్ స్పిన్నర్ యశ్‌రాజ్ పుంజా ప్రత్యర్థిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇరు జట్ల అంచనా (తుది జట్లు):
- హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్/హర్షల్.
- రాజస్థాన్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), ఫెరీరా, శుభమ్ దూబే, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్‌రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.

