Supreme court comments on Reservations: రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బీసీల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించాలని పిటిషనర్ కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉన్న పిల్లలకు రిజర్వేషన్ల అవసరమేంటని ప్రశ్నించింది. వెనకబడిన తరగతులు (బీసీ)ల్లోని సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని, క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని దాఖలైన ఓ పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Also read: Aakunuri Murali resigns: సంచలనం.. ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా?.. అసంతృప్తే కారణమా?
ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి బయటపడలేం..
‘‘తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇలా ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తులకు రిజర్వేషన్ల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, మీరు మాత్రం ఆ మినహాయింపుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. విద్యా పరంగా, ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు మళ్లీ తమ పిల్లలకు కూడా రిజర్వేషన్లు కావాలని కోరడం సబబు కాదు. ఇది ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత పిల్లల పరిస్థితి కూడా మారుతుంది. రిజర్వేషన్ల అమలులో సమతుల్యత అవసరం’’ అని ఆ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అన్నారు. రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది సామాజిక, ఆర్థిక సాధికారిత సాధించిన తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు పదేపదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారాలని, క్రిమిలేయర్ నిబంధనను ఎత్తివేయడం సరికాదని అభిప్రాయపడింది.

