Supreme Court: సర్ (Special Intensive Revision – SIR) ప్రక్రియ నిర్వహణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించే పూర్తి అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. ఈసీ చేపట్టిన సర్(SIR) ప్రక్రియ.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. బీహార్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎస్‌ఐఆర్ జాబితాను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నేడు తుది తీర్పును వెల్లడించింది.
ఆర్టికల్ 324 ప్రకారం పూర్తి అధికారాలు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానికి ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్ విషయంలో ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది.
రాజ్యాంగానికి కొత్త ఊపిరి: అర్హులైన వారితో కూడిన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ఎస్‌ఐఆర్.. ఒక కీలకమైన అడుగని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ప్రక్రియను రాజ్యాంగానికి కొత్త ఊపిరి పోసే చర్యగా న్యాయస్థానం అభివర్ణించింది. ఇది దేశ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. సర్ ప్రక్రియ అనేది.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు తోడ్పడుతుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

