HomeTop StoriesSupreme Court: నిరసనలంటూ అక్కడే కూర్చుంటే ఎలా?.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: నిరసనలంటూ అక్కడే కూర్చుంటే ఎలా?.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ(తెలుగుప్రభ): పండుగల సీజన్‌లో ఢిల్లీలో నిరసనల వల్ల వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలన్న వ్యాపార సంఘాల విజ్ఞప్తుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల పేరుతో ఎవరూ ఒక ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆందోళనల కోసం అధికారికంగా కేటాయించిన ప్రదేశాల్లోనూ నిరసనలకు సమయ పరిమితి ఉండాలని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘‘ఒక ప్రదేశాన్ని శాశ్వతంగా ఆక్రమించుకోవడం సాధ్యం కాదు. దాన్ని ఎప్పటికీ మీ అధీనంలో ఉంచుకోలేరు. ఇతర అంశాలపై నిరసనలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. రైతులు, న్యాయవాదులు ఎక్కడికి వెళ్తారు? ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది’’ అని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. నిరసనలకు పిలుపునిచ్చే నిర్వాహకులే వాటి వల్ల తలెత్తే పరిణామాలకు బాధ్యత వహించాలని అన్నారు. జూలై 20న నిర్వహించిన నిరసనకు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, ఆందోళనకారులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని పార్లమెంటు వరకు మార్చ్‌ నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వ్యాపార సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. దేశ రాజధానిలో నిరసనల కారణంగా వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు నష్టపోతున్నారని, రానున్న రెండు నెలల పాటు నిరసనలపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే ప్రజా రవాణా, వాణిజ్య కార్యకలాపాలు, ఇతరుల హక్కులకు ఇబ్బందులు కలగకుండా సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News