Tamil Nadu Budget: తమిళనాట విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సారి తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ ను బుధవారం ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమిళనాడు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ అసెంబ్లీ బడ్జెట్ ను వినిపించనున్నారు.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రతిఒక్కరి దృష్టి దీని మీదే ఉంది.
2031 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ దాదాపు 370 బిలియన్ డాలర్లు కాగా.. 2025-26లో ఇది 490 బిలియన్ డాలర్లు దాటిందనే అంచనాలు ఉన్నాయి.
20 శాతానికిపైగా వృద్ధిరేటును…
వచ్చే నాలుగైదేళ్లలో ఇది 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే.. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఏటా 20 శాతానికిపైగా వృద్ధిరేటును కనబర్చాల్సి ఉంటుంది. ఈసారి తమిళనాడు బడ్జెట్లో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు కేటాయించగా.. ఉన్నత విద్యాశాఖకు రూ.8393 కోట్లు కేటాయించారు.
తమిళనాడులోని 3734 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆధునికీకరణ కోసం రూ.2132 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఈసారి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. సూపర్ క్లీన్, సూపర్ క్యాంపస్ పథకం కోసం రూ.139 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా బడుల్లో 24 గంటల సెక్యూరిటీతోపాటు రెస్ట్ రూమ్‌లు, తాగునీటి సదుపాయం కల్పిస్తారు.
ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని తమిళనాడు ఆర్థిక మంత్రి కేంద్రాన్ని కోరారు. మదురైలో స్పెషల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని, రూ.90 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీఐలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్లో ఆరోగ్య శాఖకు రూ.23,357 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు రూ.9818 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.4880 కోట్లు కేటాయించారు.
కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే వెట్రి లాప్‌టాప్ పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 5 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లతోపాటు హెల్మెట్, వాటర్ బాటిల్ అందించడానికి రూ.277 కోట్లు కేటాయించారు.
Also Read: Ap: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సిక్ రూమ్స్

