Ind vs Afg: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి జోరుమీదున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవడంపైనే పూర్తి దృష్టి సారించింది. వర్షం కారణంగా ఓవర్లను కుదించిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. నేడు జరగబోయే రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
బ్యాటర్లకు సవాలే!: తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ పరంగా అద్భుత ప్రదర్శన చేసింది. అనుభవం లేని భారత బౌలింగ్ లైనప్‌ను టార్గెట్ చేస్తూ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసక శతకంతో చెలరేగాడు. దీంతో 25 ఓవర్ల మ్యాచ్‌లోనే అఫ్గాన్ జట్టు దాదాపు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు మరింత రెచ్చిపోవడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. ఆ మ్యాచ్‌లో అఫ్గాన్ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. అయితే తొలి మ్యాచ్‌తో పోలిస్తే రెండో వన్డే జరగనున్న లఖ్‌నవూలోని ఎకానా స్టేడియం పిచ్ భిన్నంగా ఉండనుంది. ఇక్కడి పిచ్ సాధారణంగా మందకొడిగా ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ఈ సవాలుతో కూడిన పిచ్‌పై అఫ్గాన్ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో భారత బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.
యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం: తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆకట్టుకున్న యువ పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబెలపై అందరి దృష్టీ నిలిచింది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై వీరిద్దరూ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది కీలకం కానుంది. ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మంచి ఫామ్‌లో ఉండగా.. ప్రసిద్ధ్ కృష్ణ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమైన చైనామెన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి కోసం వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్‌లను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.

