Telangana cabinet: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయం లోపించడం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. మంత్రులు, కీలక నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్.. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా దొరికింది. రేవంత్ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నా అటు మంత్రులు కానీ.. ఇటు కాంగ్రెస్ లీడర్లు కానీ కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మాది ఒరిజినల్ కాంగ్రెస్?: “పార్టీ ఉంటేనే మనకు ఉనికి.. పార్టీని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని సాధారణంగా రాజకీయ నేతలు చెబుతుంటారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం.. “మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. ఎవరు ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు.. మాకు హైకమాండే బాస్.. రాష్ట్రంలో బాస్‌లు ఎవరూ ఉండరు.. మేం ఒరిజినల్ కాంగ్రెస్” అంటూ విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ ధోరణి పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీమ్ స్పిరిట్ లేని కేబినెట్: ప్రభుత్వంపై విమర్శలు వస్తే అది క్యాబినెట్ మొత్తానికి వర్తిస్తుందని ఏ మంత్రీ భావించడం లేదు. ఎవరి శాఖకు సంబంధించిన సమస్య వస్తే.. ఆ మంత్రి మాత్రమే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సింగరేణి టెండర్లపై ఆరోపణలు వస్తే.. మిగిలిన మంత్రులంతా సైలెంట్‌గా ఉండిపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మైనింగ్ ఆరోపణలు వస్తే స్వయంగా ఆయనే స్పందించాల్సి వచ్చింది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి వ్యవహారంలోనూ పౌర సరఫరాల శాఖ మంత్రే ఒంటరిగా సమాధానం ఇచ్చుకున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ విపక్షాలు దాడి చేస్తున్నప్పుడు టీమ్ స్పిరిట్‌తో వ్యవహరించాలని ఏఐసీసీ నేతలు పలుమార్లు హెచ్చరించినా మంత్రుల తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది.
Also read-Karnataka: కన్నడ పీఠంపై డీకే.. నేడు సిద్ధరామయ్య రాజీనామా!
సెక్రటేరియట్‌లో గుసగుసలు!: మంత్రులలో ఒకరంటే ఒకరికి పడని తీరు పలు సందర్భాల్లో బట్టబయలైంది. గతంలో సహచర మంత్రిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యింది. మంత్రుల మధ్యనే కాకుండా ముఖ్యమంత్రికి.. మరికొద్దిమంది మంత్రులకు మధ్య కూడా గ్యాప్ ఉందనే గుసగుసలు సచివాలయం వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మినహా మిగిలిన మంత్రులకు ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవాలనే ఆలోచనే లేదన్న విమర్శలు గాంధీభవన్‌లో సైతం వినిపిస్తున్నాయి.
పీసీసీ చీఫ్‌కు రక్షణ కరవు: పార్టీ స్టేట్ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా ఓ మీడియాలో పలు కథనాలు వస్తున్నా ఆయన తరఫున పార్టీ ప్రతినిధులు స్పందించకపోవడం తాజాగా చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్టీ పెద్దను ఎవరైనా విమర్శిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేయడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. బీఆర్ఎస్ పార్టీని గమనిస్తే.. తమ అధినేతను ఎవరైనా దూషిస్తే ఆ పార్టీ నేతలు ఘాటుగా కౌంటర్‌లు ఇస్తూ డిఫెండ్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం పీసీసీ చీఫ్‌ను విమర్శించినా లీడర్లు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలను విపక్షాలు చులకన చేస్తున్నా కొద్దిమంది ఎమ్మెల్యేలు మినహా మంత్రులు నోరు విప్పడం లేదు. పార్టీ మొత్తాన్ని నడిపించాల్సిన పీసీసీ చీఫే ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వెనుక అసలు కారణాలేంటనేది ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

