Telangana AP Rain: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాతావరణం మారనున్నట్లు తెలుస్తుంది.ఉపరితల ఆవర్తనం,రుతుపవన ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల మీద వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం ,మంచిర్యాల,నిర్మల్,భద్రాద్రికొత్తగూడెం వంటి జిల్లాలకు అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇతర ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.హైదరాబాద్లో రోజంతా మేఘావృత వాతావరణం ఉండొచ్చు.
ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జల్లులు పడొచ్చు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగుల సమయంలో రైతులు, కూలీలు చెట్ల కిందకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Also Read:Ganesha in dreams: కలలో గణేశ నిమజ్జనం కనిపిస్తే సంకేతాలు ఇవే

