HomeTop StoriesCM Revanth Reddy: ఏరో, డిఫెన్స్‌, స్పేస్‌ హబ్‌గా తెలంగాణ..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో...

CM Revanth Reddy: ఏరో, డిఫెన్స్‌, స్పేస్‌ హబ్‌గా తెలంగాణ..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్

హైదరాబాద్‌ (తెలుగుప్రభ): తెలంగాణను ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాల్లో దేశంలోనే కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ – 2026’కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. డిఫెన్స్‌ ఎక్స్‌పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలపై ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే వారికి మరింత స్ఫూర్తి లభిస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

సూర్యకిరణ్‌, సారంగ్‌ బృందాలకు ఆహ్వానం
డిఫెన్స్‌ ఎక్స్‌పోలో భాగంగా ఎయిర్‌షో నిర్వహించేందుకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని సీఎం కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయడంతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని రేవంత్‌రెడ్డి కోరారు.

డీఆర్‌డీఎల్‌కు 416 ఎకరాలు
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రక్షణ పరిశోధన ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించిందని సీఎం తెలిపారు. మొత్తం భూమిని సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజుతో 33 సంవత్సరాల పాటు కేటాయించనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరో రెండు పర్యాయాలు లీజును పొడిగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో 750 ఎకరాలు
ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ కోరిన మొత్తం 1,500 ఎకరాల్లో మిగిలిన మరో 750 ఎకరాలను సేకరించి ఇచ్చేందుకు అంగీకరించారు. హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ వంటి రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థలతో పాటు డీఆర్‌డీవో ప్రయోగశాలలు డిఫెన్స్‌ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని సీఎం కోరారు. విదేశీ రక్షణ శాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, బలరాం నాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కార వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News