Assembly: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ సభ్యులు: రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.”రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? హౌస్ కమిటీ వేయడానికి అభ్యంతరం ఏంటని?” బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్: బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై ఐటీ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ సజావుగా జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. మైనింగ్ వ్యవహారాలపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల వద్ద ఏవైనా పక్కా ఆధారాలు ఉంటే వాటిని సీఐడీకి అందజేయాలని కోరారు. సీఐడీ విచారణ కొనసాగుతున్నప్పుడు మళ్లీ హౌస్ కమిటీ అవసరం ఏముందని ప్రశ్నించారు.
Also read-Bandi Sanjay : సీఎం రేవంత్, కేసీఆర్ కుమ్మక్కయ్యారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్ల పాలనపై చురకలు: సీఐడీ వ్యవస్థపై నమ్మకం లేకుండానే గత పదేళ్లు పాలన సాగించారా అని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు.సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్యయుతం కాదని అన్నారు. చర్చకు సహకరించాలని అధికార పక్షం కోరుతుండగా.. హౌస్ కమిటీ వేసే వరకు వెనక్కి తగ్గేది లేదని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఈ పరిణామాలతో అసెంబ్లీలో వాడీవేడి చర్చ కొనసాగుతోంది.

