HomeTop StoriesTelangana: 4.20 కోట్లు దాటిన రాష్ట్ర జనాభా.. కుటుంబాల సంఖ్య ఎంతంటే?

Telangana: 4.20 కోట్లు దాటిన రాష్ట్ర జనాభా.. కుటుంబాల సంఖ్య ఎంతంటే?

Census: రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ (జనగణన) మొదటి దశ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కేంద్ర జనాభా లెక్కల విభాగం ఆధ్వర్యంలో గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు నిర్వహించిన తొలి విడతలో ప్రతి కుటుంబం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ నెల 9 నాటికి నమోదైన ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇంకా ఎవరి ఇంటికైనా జనాభా లెక్కల సిబ్బంది రానట్లయితే.. ఈ గురువారం(జూన్‌-11)లోగా సమీపంలోని మున్సిపల్ లేదా పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

- Advertisement -

పెరిగిన కుటుంబాల సంఖ్య: 2010-11 నాటి లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జిల్లాల జనాభా 3.50 కోట్లుగా ఉండేది. అప్పటితో పోలిస్తే గత 16 ఏళ్లలో 1.25 శాతం వార్షిక వృద్ధిరేటుతో అదనంగా మరో 70 లక్షల జనాభా పెరిగినట్లు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. బాహ్య వలయ రహదారి (ORR) వరకు విస్తరించి ఉన్న పాత గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా ఈసారి కోటిన్నర (1.50 కోట్లు) దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 2011లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జనాభా కేవలం 92 లక్షలుగా మాత్రమే ఉండేది. జనాభాతో పాటు రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉండగా.. తాజా గణన ప్రకారం ఆ సంఖ్య 1.20 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

Also read-CM Revanth Reddy: కేవలం మనకే కాదు యావత్‌ ప్రపంచానికే ఫ్యూచర్‌ సిటీ..!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ: జనగణన ప్రక్రియ మొత్తం రెండు దశల్లో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. గత నెల రోజులుగా సుమారు 80 వేల మంది ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కట్టడం, ఇల్లు, అందులోని మౌలిక సదుపాయాలు, కుటుంబ పెద్ద పేరు, సభ్యుల సంఖ్య వంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ జనగణన ప్రారంభం కానుంది. ఈ దశలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ఈ రెండు దశల్లో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం తుది గణాంకాలను ప్రకటిస్తుంది. బహుశా 2027 ఆఖరుకు లేదా 2028 ఆరంభానికల్లా అధికారిక జనాభా వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News