Forensic lab: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంపై మిస్టరీ వీడుతోంది. ఈ ఘటనపై ఎఫ్‌ఎస్‌ఎల్ ఇన్‍స్పెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట అంతా సురక్షితం అని భావించినప్పటికీ.. కీలకమైన ఐదు విభాగాల్లో ఫైళ్లు, సామగ్రి కాలిపోయినట్లు ప్రాథమికంగా తేలింది.
ఎఫ్ఐఆర్‌లోని ముఖ్యాంశాలు: ఇన్‍స్పెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు ప్రకారం.. మొదటి అంతస్తులోని కీలకమైన విభాగాలు అగ్నికి ఆహుతయ్యాయి. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్ మరియు సర్వర్ రూమ్ విభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సర్వర్ రూమ్‍లోని ఫైళ్లతో పాటు ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచిన పలు రికార్డులు కాలిపోయినట్లు పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌డీ (HRD) హాల్, ఫర్నిచర్ మరియు ఖరీదైన ల్యాబ్ పరికరాలు సైతం దెబ్బతిన్నాయి.
Also read-Nampalli: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
అసలు ఏం జరిగిందంటే: శనివారం ఉదయం 10:08 గంటలకు క్లాస్-IV ఉద్యోగి సాయికృష్ణ నుంచి ఇన్‍స్పెక్టర్‌కు సమాచారం అందింది. ప్రాపర్టీ రూమ్‌లో అంటుకున్న మంటలు వేగంగా పక్క గదులకు వ్యాపించాయి. సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో ప్రయత్నించినప్పటికీ పొగ దట్టంగా కావడంతో సాధ్యపడలేదు. అగ్నిమాపక సిబ్బంది ఉదయం 10:30 గంటలకు చేరుకుని మధ్యాహ్నం 1:30 గంటల వరకు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు.
రంగంలోకి ‘క్లూస్’ టీమ్.. ల్యాబ్ సీజ్!: ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. క్లూస్ టీమ్ మరియు స్పెషల్ బ్రాంచ్ (SB) అధికారులు క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సీసీ కెమెరాల డేటాను విశ్లేషిస్తున్నారు.
Also read- Hyderabad: కీలక ఫైల్స్ అన్నీ సేఫ్.. పుకార్లను నమ్మవద్దు!
డైరెక్టర్ శిఖాగోయల్ కీలక ప్రకటన?: సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు, కుట్ర కోణాలు ప్రచారమవుతున్న నేపథ్యంలో టీజీ ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ నేడు ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. ఆమె చేసే ప్రకటనతో ఏ ఏ కేసులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయాయి? ఎంతవరకు నష్టం జరిగింది? అనే విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

