HomeTop StoriesTelangana: త్యాగాల పురిటిగడ్డ.. నేటి స్వేచ్ఛా తెలంగాణ!

Telangana: త్యాగాల పురిటిగడ్డ.. నేటి స్వేచ్ఛా తెలంగాణ!

Telangana Formation Day: “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాట ఫలం.. నేటి స్వేచ్ఛా తెలంగాణ. జూన్ 2 చారిత్రాత్మక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభవేళ.. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ యావత్ తెలంగాణ సమాజం సగర్వంగా నివాళులర్పిస్తోంది.

- Advertisement -

త్యాగాల పునాదులపైనే స్వరాష్ట్ర సౌధం: తెలంగాణ ఉద్యమం అంటే కేవలం ఒక రాజకీయ ప్రక్రియ కాదు.. అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటం. 1969 తొలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 369 మంది విద్యార్థుల బలిదానాల నుంచి.. మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాకపోతే బతుకు వృథా అంటూ.. ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి వందలాది మంది యువకుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర అభివృద్ధిని సాధించడమే ఆ వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

గంగ-జమునా తెహజీబ్: భౌగోళికంగానే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాల పరంగానూ తెలంగాణ ఎంతో విశిష్టమైనది. బతుకమ్మ, బోనాల పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. ఇక్కడి జానపదాలు, డప్పు చప్పుళ్లు, విభిన్నమైన యాస యావత్ దేశాన్ని ఆకట్టుకుంటాయి. హిందూ-ముస్లింల ఐక్యతకు చాటిచెప్పే గంగ-జమునా తెహజీబ్ తెలంగాణ సొంతం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అంటూ ప్రజా చైతన్యాన్ని రగిల్చిన విప్లవ గడ్డ ఇది. కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య వంటి మహానుభావుల కలాల నుంచి జాలువారిన అక్షరాలు తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు.

యావత్ దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానం: సొంత పాలన ప్రారంభమైన ఈ పన్నెండేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి అమోఘం. ఒకప్పుడు కరవుతో, వలసలతో అల్లాడిన ప్రాంతం.. నేడు దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. బీడు వారిన భూములు నేడు కోటి ఎకరాల మాగాణంగా మారింది. దీంతో దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ నగరం గ్లోబల్ ఐటీ లీడర్‌గా ఎదిగింది. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పేద ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి లక్ష్యాలతో సామాజిక న్యాయం దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News