Telangana Police: తెలంగాణలో ఇక నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకటే నంబర్ ఉపయోగంలోకి రానుంది. డయల్ 100 స్థానంలో కొత్తగా 112 నంబర్ ను పోలీస్‌శాఖ ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక, ఇతర సర్వీసుల కోసం ఇక నుంచి డయల్ 112 నంబర్‍ను తీసుకువచ్చింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‍లో డీజీపీ సీవీ ఆనంద్ ఈ నూతన ఎమర్జెన్సీ కాల్ సెంటర్‍ను ప్రారంభించారు.
దీంతో ఇప్పటి వరకు వేర్వేరు సేవలకు వేరు నంబర్లతో ఉన్న సేవలను ఇకపై ఒకే తాటి మీదకు రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు వంటి అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 కు కాల్ చేస్తే వెంటనే సహాయం లభిస్తుందని డీజీపీ ఆనంద్ తెలిపారు.
112కు కాల్ వచ్చిన వెంటనే…
ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కాల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేశామని డయల్ 112కు కాల్ వచ్చిన వెంటనే సమాచారం సమీప పోలీస్ స్టేషన్ కు చేరవేస్తారని డీజీపీ చెప్పారు. కొత్త ఎమర్జెన్సీ నంబర్ 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఎమర్జెన్సీ కాల్ రాగానే కాలర్ లొకేషన్ గుర్తించి దగ్గర్లోని పోలీస్, ఫైర్ రెస్పాన్స్ టీమ్ లకు సమాచారం చేరుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను మరింతగా తెలంగాణ పోలీసు ఉపోయగించుకోబోతోందని ఆయన పేర్కొన్నారు.

