Kanakadurga temple: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అమ్మవారి సేవలో మంత్రి కోమటిరెడ్డి: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికి.. అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు మంత్రిని శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇతర స్థానిక నేతలు ఉన్నారు.
భక్తులతో ముచ్చటించిన మంత్రి: ఆలయ ప్రాంగణంలో మంత్రిని చూసిన తెలుగు రాష్ట్రాల భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. మంత్రి సైతం సామాన్య భక్తులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లుగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టమని మంత్రి అన్నారు. ఆలయ మర్యాదలు, సత్కారాలు అందించిన అర్చకులకు, అధికారులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



