Telangana Minister: పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర దాడుల కారణంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుల వైద్య చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్ వెళ్లగా.. తాజా యుద్ధ పరిణామాలతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.
విమానాశ్రయంపై దాడులు: మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ జరుపుతున్న ప్రతి దాడుల ప్రభావం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. ఆదివారం అర్థరాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-3 సమీపంలో క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం గగనతలాన్ని మూసివేసి.. విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల సైతం విమానాశ్రయ పరిసరాల్లోనే ఉండిపోయారు.
Also read-CM Revanth Reddy: ‘గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి’
అప్రమత్తమైన రేవంత్ సర్కార్: ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే దుబాయ్ గగనతలం తిరిగి తెరుచుకొని.. విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వారు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. అయితే మంత్రిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భారత రాయబార కార్యాలయం (Embassy) అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మంత్రి ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

