KCR SIT Notices : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరిందా? తీగ లాగుతుంటే డొంక మొత్తం కదులుతోందా? నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రులు, కీలక నేతల చుట్టూ తిరిగిన విచారణ చక్రం.. ఇప్పుడు ఏకంగా గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) వైపు మళ్లిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఇప్పుడు ఏకంగా అధినేతనే టార్గెట్ చేసిందా?
ఫామ్‌హౌస్‌కు సిట్ బృందం.. ఇవాళే నోటీసులు : రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు (గురువారం) సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సాధారణంగా విచారణకు పిలిపించడం కాకుండా, ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే సిట్ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందజేసిన అనంతరం, రేపు (శుక్రవారం) అక్కడే ఆయనను విచారించేలా సిట్ ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఒక మాజీ ముఖ్యమంత్రిని, అది కూడా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన అధినేతను ఈ కేసులో విచారణకు పిలవడం రాష్ట్ర చరిత్రలోనే సంచలనంగా మారింది.
కేటీఆర్, హరీష్ తర్వాత.. ఇప్పుడు కేసీఆర్ : ఈ కేసు దర్యాప్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులను సిట్ అధికారులు పలు దఫాలుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే, ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు భోగట్టా. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది నిగ్గుతేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ : కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారన్న వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని గులాబీ నేతలు ఆరోపిస్తుండగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం వాదిస్తోంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. విచారణలో కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? సిట్ తదుపరి అడుగు అరెస్ట్ వైపు ఉంటుందా? లేక కేవలం వాంగ్మూలం నమోదుతో సరిపెడతారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ఈ పరిణామంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

