HomeTop StoriesNational Awards: తెలంగాణ పల్లెల జోరు.. మోతుకుపల్లి, ఫసల్వాడికి జాతీయ పురస్కారాలు!

National Awards: తెలంగాణ పల్లెల జోరు.. మోతుకుపల్లి, ఫసల్వాడికి జాతీయ పురస్కారాలు!

National Panchayat Awards: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన “దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు” (DDUPSVP) లో రాష్ట్రానికి చెందిన రెండు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి.

- Advertisement -

అవార్డులు దక్కించుకున్న పంచాయతీలు: ‘గుడ్ గవర్నెన్స్’ (సుపరిపాలన) విభాగంలో వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి గ్రామ పంచాయతీ పురస్కారం దక్కించుకుంది. పారదర్శక పాలన, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు గాను ఈ గుర్తింపు లభించింది. అలాగే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండ‌ల పరిధిలో గల ఫసల్వాడి గ్రామ పంచాయతీ ‘విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’ (మహిళా స్నేహపూర్వక పంచాయతీ) విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళ సాధికారత, భద్రత కార్యక్రమాల అమలుకై చేసిన కృషికి గాను ఈ అవార్డు ద‌క్కింది.

మంత్రి సీతక్క హర్షం: తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణంగా ఉందని అన్నారు. పారదర్శక పాలన, మహిళా సాధికారతపై మా ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక చొరవకు ఈ అవార్డులే నిదర్శనమని తెలిపారు. మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయాలు రాష్ట్రంలోని ఇతర పంచాయతీలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News