Temperature: రాష్ట్రంలో భానుడు ప్రచండ రూపం దాల్చాడు. ఆకాశం నుంచి నిప్పుల కురిపిస్తున్నట్లుగా ఎండలు దంచి కొడుతుండటంతో తెలంగాణ అల్లాడిపోతోంది. తీవ్రమైన వడగాలుల ధాటికి జనం హడలెత్తిపోతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డులను తిరగరాశాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక రాష్ట్రంలో ఒకే రోజు 11 మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు.
నిర్మల్‌లో అత్యధికం: రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40.5 డిగ్రీల మార్కును దాటేశాయి. ఇందులో 19 జిల్లాల్లో ఏకంగా 46 డిగ్రీలకు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో ఇక్కడ 2019 మే నెలలో నమోదైన 46.3 డిగ్రీల రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో 46.4 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా వనపర్తి జిల్లా చిన్నంబావిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పొరుగు రాష్ట్రమైన ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బకు 11 మంది బలి: ఎండ తీవ్రతకు బుధవారం వేర్వేరు జిల్లాల్లో 11 మంది విగతజీవులయ్యారు.
- పెద్దపల్లి జిల్లా: సామ లచ్చిరెడ్డి (58-రైతు), శ్రీపతి లక్ష్మీ (60-ఉపాధిహామీ కూలీ), కనుకుంట్ల కనకయ్య (77).
- రాజన్న సిరిసిల్ల జిల్లా: లచ్చవ్వ (58-రైతు), రాజిరెడ్డి (60).
- కరీంనగర్ జిల్లా: గాజర్ల సతీష్ (45-దివ్యాంగుడు).
- సూర్యాపేట జిల్లా: బోడ లింగరాజు (34).
- ములుగు జిల్లా: బోడ సాంబయ్య (43-మున్సిపల్ కార్మికుడు).
- మహబూబాబాద్ జిల్లా: నేరళ్ల సోమయ్య (75-ఉపాధిహామీ కూలీ).
- జనగామ జిల్లా: పల్లాటి భిక్షపతి (65).
- ఆదిలాబాద్ జిల్లా: నాయిని పొచ్చన్న (30-వ్యవసాయ కూలీ).
మే 25 వరకు వడగాలుల హెచ్చరిక: కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 నుండి 6.5 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. మే 25వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు.

