Andhra Pradesh: రాష్ట్రంలో గత వారం రోజులుగా భానుడి భగభగలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పౌల్ట్రీ రంగానికి కోలుకోని దెబ్బతగిలింది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత తోడవడంతో ఫారం కోళ్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏటా వేసవిలో కోళ్ల మరణాలు సహజమే అయినప్పటికీ.. ఈ ఏడాది మరణాల సంఖ్య రెట్టింపు కావడం పౌల్ట్రీ రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒక్కరోజే 10 లక్షల కోళ్లు మృతి: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుండగా.. వారం రోజులుగా కురుస్తున్న వడగాడ్పుల కారణంగా సుమారు 30 నుంచి 50 లక్షల కోళ్లు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఛైర్మన్ కోమటపల్లి సుబ్బారావు తెలిపారు. కేవలం ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయని అన్నారు. ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 3 లక్షల కోళ్లు చనిపోయాయని తెలిపారు.
పడిపోయిన గుడ్ల ఉత్పత్తి: ఎండల ప్రభావం గుడ్ల ఉత్పత్తిపై సైతం పడింది. సాధారణ రోజుల్లో ఫారాల్లో 90 శాతం వరకు గుడ్ల ఉత్పత్తి ఉంటే.. ప్రస్తుతం అది 55-60 శాతానికి పడిపోయింది. ఒకవైపు నెల రోజుల కిందట పెరిగిన మేత ధరలు భారం కాగా.. మరోవైపు ఉత్పత్తి క్షీణించడంతో ప్రస్తుత గుడ్డు ధర (రూ.5) తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి: కోళ్ల మరణాలకు సంబంధించి భారీగా ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ.. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సకాలంలో పరిహారం అందడం లేదు. దీంతో విసిగిపోయిన రైతులు బీమా చేయించుకోవడం మానేశారు. ఫలితంగా కోళ్లు చనిపోతే పూర్తి నష్టాన్ని రైతులే భరించాల్సి వస్తోంది. దీంతో పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కోళ్ల మేత ధరలపై రాయితీలు ప్రకటించడంతో పాటు.. నష్టపోయిన రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని కోమటపల్లి సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

