HomeTop StoriesNandavaram water problem:పది మీటర్లలో పది కొళాయిలు!

Nandavaram water problem:పది మీటర్లలో పది కొళాయిలు!

ఎగువ ప్రాంతానికి నీటి వరద.. దిగువ ప్రాంతానికి నీటి ఎద్దడి!

- Advertisement -

ప్రధాన పైపులైన్‌కే ఇష్టారాజ్యంగా కనెక్షన్లు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

నందవరం, (తెలుగు ప్రభ):పది మీటర్ల పరిధిలో పది మంచినీటి కొళాయిలు! ఒకవైపు నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు అవసరానికి మించి ఇష్టారాజ్యంగా కొళాయి కనెక్షన్లు ఇవ్వడం నందవరం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.

గ్రామంలోని ప్రజలందరికీ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌కే ఎక్కడపడితే అక్కడ కనెక్షన్లు ఇవ్వడంతో ఎగువ ప్రాంతంలో నీటి వినియోగం అధికమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎగువ ప్రాంతాల్లో నీరు వృథాగా పోతుండగా.. దిగువ ప్రాంతాలకు మాత్రం చుక్క నీరు కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.

కనెక్షన్ కావాలంటే చాలు.. వెంటనే మంజూరు?

బీసీ కాలనీలో అవసరం ఉన్నా లేకపోయినా కొళాయి కనెక్షన్లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొందరు నాయకులు తమ అనుచరులు, అనుకూల వర్గాలకు అడిగిన వెంటనే నీటి కనెక్షన్లు ఇప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాస్తవంగా నీటి అవసరం ఎంత ఉంది? పైపులైన్ సామర్థ్యం ఎంత? అనే అంశాలను పరిశీలించకుండా కనెక్షన్లు ఇవ్వడం వల్లే సమస్య మరింత జఠిలమవుతోందని స్థానికులు అంటున్నారు.

రెండేళ్లలో వందల కనెక్షన్లా?

గత రెండేళ్లుగా గ్రామంలో కొందరు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి ఎక్కడపడితే అక్కడ వందల సంఖ్యలో అక్రమ నీటి కనెక్షన్లు ఇప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు కోరుతున్నారు.

వేసవి ముందే ప్రజల్లో ఆందోళన

ప్రస్తుతం నీటి వినియోగం పెరుగుతున్న పరిస్థితుల్లోనే దిగువ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతుంటే.. రానున్న వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టకపోతే దిగువ ప్రాంత ప్రజలకు తీవ్ర తాగునీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

అధికారులు స్పందించేనా?

గ్రామంలోని ప్రధాన పైపులైన్‌కు ఇచ్చిన అన్ని కనెక్షన్లను అధికారులు పరిశీలించి, అక్రమంగా ఉన్న వాటిని గుర్తించి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా పరిశీలించి, అవసరానికి అనుగుణంగా కనెక్షన్లు క్రమబద్ధీకరించి గ్రామంలోని ప్రతి ప్రాంతానికి సమానంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి కొళాయి కనెక్షన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడతారా? లేక వేసవి వచ్చే వరకు సమస్యను ఇలాగే వదిలేస్తారా? అని నందవరం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also Read:Rising Sun: రాష్ట్రస్థాయి త్రోబాల్‌కు రైజింగ్ సన్ విద్యార్థులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News