Delhi High Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐకి ఊరట లభించింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది.
23 మందికి నోటీసులు: దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మొత్తం 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో నిందితులకు క్లీన్‌చిట్ ఇస్తూ.. దర్యాప్తు సంస్థ (CBI) తీరుపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలను వినిపించారు. ఈడీ కేసు విచారణను కూడా వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (మార్చి 16) వాయిదా వేసింది.
Also read-Party defection: అనర్హత వేటు పడదు.. స్పీకర్ తీర్పుపై దానం ధీమా!
మద్యం కేసులో మళ్లీ ఉత్కంఠ: దిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టు నిందితులకు ఉపశమనం కలిగిస్తూ తీర్పునివ్వడంతో పాటు దర్యాప్తు అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో ఇప్పుడు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. వచ్చే సోమవారం జరగబోయే విచారణలో నిందితులు సమర్పించే వివరణ ఆధారంగా ఈ కేసులో తదుపరి పరిణామాలు ఉండనున్నాయి.

