Nominations: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిప్పటికీ.. ఉపసంహరణ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ‘బీ-ఫామ్’ లొల్లి ముదిరింది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ.. బీ-ఫామ్‌లు చేతికి అందక ఆశావహులు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు.
జంపింగ్‌ల భయం.. నేతల వ్యూహం: టికెట్ ఆశించి భంగపడ్డ వారు రెబల్స్‌గా మారడం లేదా ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వడం ఖాయమని భావిస్తున్న అధిష్టానాలు.. బీ-ఫామ్‌ల పంపిణీలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. సోమవారం రాత్రి వరకు కూడా చాలా చోట్ల అభ్యర్థులకు స్పష్టత ఇవ్వలేదు. ఇక ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం అధికార పక్షంబాటలోనే వెళ్తున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన చోట బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పటికే ఫారాలు అందజేయగా.. గట్టి పోటీ ఉన్న వార్డుల్లో మాత్రం గోప్యత పాటిస్తున్నాయి.
నేతల ఆచితూచి అడుగులు: ప్రతీ వార్డులో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో గందరగోళం నెలకొంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాం.. మాకే టికెట్ ఇవ్వాలని కొందరు పట్టుబడుతుంటే, గెలుపు మాదే.. ఎంత ఖర్చయినా వెనకాడమని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసంతృప్తులను దారికి తెచ్చేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడం లేదా ఇతర ప్యాకేజీల ఆశ చూపి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు రహస్యంగా బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం.
Also read-Municipal Elections: సర్వేలన్నీ మనకే అనుకూలం.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్ధేశం
నేడు తేలనున్న అభ్యర్థుల’బీ-ఫామ్’ భవితవ్యం: మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపు బీ-ఫారాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంది. ఆ సమయానికి ఫారమ్ అందకపోతే సదరు అభ్యర్థులను స్వతంత్రులుగానే పరిగణిస్తారు. దీంతో గెలుపు గుర్రాల వేటలో ఉన్న పార్టీలు ఎవరికి అవకాశం ఇస్తాయనేది నేటి మధ్యాహ్నానికి తేలిపోనుంది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రచార పర్వం ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

