Monday, February 16, 2026
HomeTop StoriesUnion Budget 2026-27: మళ్లీ నిరాశే.. రైల్వే కారిడార్లే ఏకైక ఊరట!

Union Budget 2026-27: మళ్లీ నిరాశే.. రైల్వే కారిడార్లే ఏకైక ఊరట!

Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న గంపెడాశలపై కేంద్రం నీళ్లు చల్లింది. విభజన హామీల అమలు, ప్రత్యేక నిధుల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాల్లో తెలంగాణ ప్రస్తావన నామమాత్రంగానే ఉండిపోయింది.

- Advertisement -

రాష్ట్ర విజ్ఞప్తులకు దక్కని మోక్షం: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 1.65 లక్షల కోట్ల సాయాన్ని కేంద్రం నుండి ఆశించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

Also read-Union Budget 2026-27: యువశక్తికి పట్టాభిషేకం… ఆర్థికానికి మూడు సూత్రాలు!

బడ్జెట్‌లో విస్మరించిన కీలక అంశాలు: రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిధుల కేటాయింపులో స్పష్టత లేకుండా పోయింది. ముసీ పునరుజ్జీవం & మెట్రో విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుండి మొండిచేయే ఎదురైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశం మళ్లీ పెండింగ్‌లో పడింది. రాష్ట్రం కోరిన ఐఐఎం (IIM), అదనపు నవోదయ పాఠశాలలు, స్కిల్ వర్సిటీ ప్రస్తావన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో లేనేలేదు. ఐటీఐఆర్ (ITIR), లెదర్ పార్కులు, సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు వంటి డిమాండ్లు బుట్టదాఖలయ్యాయి.

రైల్వే కారిడార్లే ఏకైక ఊరట!: దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లలో మూడు హైదరాబాద్ మీదుగా వెళ్లడం ఒక్కటే ఈ బడ్జెట్‌లో తెలంగాణకు దక్కిన ప్రధాన అంశం. విజన్-2047లో భాగంగా ప్రకటించిన ఈ కారిడార్ల వల్ల భవిష్యత్తులో రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది.

Also read-Income Tax Reforms: ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం.. ఐటీ రిటర్నుల గడువు పెంపు.!

స్వల్పంగా పెరిగిన పన్నుల వాటా: 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటాను 41% నుండి 42.5%కి పెంచారు. దీనివల్ల తెలంగాణకు వచ్చే వాటా గత ఏడాది కంటే స్వల్పంగా పెరిగింది. గత ఏడాది రూ. 29,280 కోట్లు రాగా.. ఈ ఏడాది (అంచనా) రూ. 33,181 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారు రూ. 4,000 కోట్ల అదనపు నిధులు పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి చేరనున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం: కేంద్రం నుండి ప్రత్యేక నిధులు రాకపోవడం వల్ల రాష్ట్రం త్వరలో ప్రవేశపెట్టబోయే సొంత బడ్జెట్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏఐ (AI), డేటా సెంటర్లు, సెమీకండక్టర్ మిషన్ వంటి రంగాల్లో కేంద్ర పథకాలను అందిపుచ్చుకుంటే కొంతమేర ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేకపోవడం వేతన జీవులను, స్టార్టప్ విధానాల్లో మార్పులు లేకపోవడం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను నిరాశకు గురిచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News