Ind Vs Eng: ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ముగించాలని పట్టుదలగా ఉన్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగే చివరి వన్డేలో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో పుంజుకుంది. దీంతో నేడు జరిగే చివరి వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే ఫైనల్‌గా మారింది.
రోహిత్‌పైనే అందరి దృష్టి: భారత క్రికెట్‌లో గత మూడు రోజులుగా అందరి దృష్టి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపైనే ఉంది. రోహిత్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగచెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ పెద్దలు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ అందరి దృష్టి 39 ఏళ్ల హిట్ మాన్ పైనే ఉంది. దీంతో రోహిత్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటడం అత్యంత కీలకంగా మారింది. గత రెండు వన్డేల్లోనూ రోహిత్ (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కెప్టెన్ గిల్‌తో కలిసి అతడు జట్టుకు బలమైన పునాది వేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లిష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసే ఆరంభ ఓవర్లను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Also Read-BCCI: లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
టాస్ గెలిస్తే బ్యాటింగే!: లార్డ్స్ పిచ్ సాధారణంగా స్ట్రోక్‌ప్లేకు అంతగా సహకరించదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మైదానంలో భారత్‌కు మిశ్రమ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 9 వన్డేల్లో భారత్ నాలుగింటిలో గెలిచింది. అందులో చారిత్రాత్మక 1983 ప్రపంచకప్ ఫైనల్ ఒకటి. అయితే లార్డ్స్‌లో టీమిండియా చివరిసారిగా 2004లో వన్డే విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
అంచనా తుది జట్లు:
- భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్/హర్ష్ దూబె, జస్‌ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ.
- ఇంగ్లాండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.

