Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జులై నెలలో హుండీ ఆదాయం చరిత్రనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాస్తుండగా…జులై నెలలో వచ్చిన హుండీ ఆదాయం మాత్రం ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది.
ఈ ఏడాది జూన్ లో 25.26 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా..టీటీడీకి రూ.128.29 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.గతేడాది జూన్ తో పోలిస్తే ఇది రూ.8.44 కోట్లు ఎక్కువని అధికారులు స్పష్టం చేశారు. అయితే జులైలో భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.కానీ ఆదాయం మాత్రం భారీగా వచ్చింది.
24.52 లక్షల మంది భక్తులు..
జులై 1 నుంచి 31 వరకు 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రికార్డు స్థాయిలో రూ. 140.28 కోట్ల కానుకలు హుండీ ద్వారా వచ్చాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 129.45 కోట్లతో పోలిస్తే ఇది చాలా అత్యధికం. జులై 16న ఒక్కరోజే గరిష్టంగా రూ. 5.31 కోట్లు రాగా, నెలలో మొత్తం 5 సార్లు రోజువారీ ఆదాయం రూ. 5 కోట్లు దాటింది. మరో 21 రోజుల పాటు రోజుకు రూ. 4 కోట్లకు పైగా కానుకలు అందాయి.
శ్రీవారి దర్శనంతో పాటు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం విక్రయాల్లోనూ టీటీడీ రికార్డులు సృష్టించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల తయారీని విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా పంపిణీ చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో 1.27 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, జులై నెలలో ఏకంగా 1,30,86,278 లడ్డూలను భక్తులకు విక్రయించారు.
Also Read:Kiran Kumar Reddy: అభివృద్ధి చేస్తే ఓటర్లు ఓట్లు వేసేయరు

