Bakrid festival: త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర ఈద్-ఉల్-అజా (బక్రీద్) పండుగను నేడు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఇస్లాం ధర్మ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ రోజున ఈద్గాలు, మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పండుగ సంప్రదాయంలో భాగంగా పేదలకు, బంధువులకు ఖుర్బానీ (దానం) సమర్పిస్తున్నారు.
నెలవంక ఆలస్యం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నేడు సెలవును ప్రకటించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు బ్యాంకులు ఈరోజు మూతపడ్డాయి. తొలుత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మే 27వ తేదీనే అధికారిక సెలవుగా ప్రకటించాయి. కానీ నెలవంక ఒకరోజు ఆలస్యంగా దర్శనం ఇవ్వడంతో పండుగ తేదీని మే 28కి మారుస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు స్పందించి.. తమ పూర్వపు ఉత్తర్వులను సవరిస్తూ సెలవు దినాన్ని నేటికి మార్చాయి.
Karnataka: కన్నడ పీఠంపై డీకే.. నేడు సిద్ధరామయ్య రాజీనామా!
శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇబ్రహీం ప్రవక్త త్యాగనిరతి, భక్తిభావం మానవాళికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ పండుగ సమాజంలో శాంతి, కరుణ, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగే ముస్లిం సోదరులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు చేసుకునేలా ఇరు రాష్ట్రాల్లోని ఈద్గాల వద్ద శాంతిభద్రతల పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

