Jagjivan Ram birth anniversary: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక విప్లవకారుడిగా దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. భారత మాజీ ఉప ప్రధాని సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కొనియాడారు
సామాజిక న్యాయం కోసం పునరంకితం కావాలి: జగ్జీవన్ రామ్ జయంతిని సమతా దివస్‌గా జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సమాజంలో వేళ్లూనుకున్న వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఐక్యత మరియు సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధనలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం పేర్కొన్నారు.
Also read-CM Revanth Reddy: ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహాలో ఆంక్షలు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే దళిత సాధికారత: భారత మాజీ ఉప ప్రధాని సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. రక్షణ, వ్యవసాయం, కార్మిక శాఖల మంత్రిగా దేశ ప్రగతిలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తితోనే గత పదేళ్లలో దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో ఎస్సీ నాయకత్వానికి పెద్దపీట వేశామని ఆయన గుర్తుచేశారు. దళిత బహుజనులకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పూర్తిస్థాయి సామాజిక న్యాయం దక్కినప్పుడే జగ్జీవన్ రామ్‌కు నిజమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.

