Tuesday, December 9, 2025
HomeTop StoriesAnti defection: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ!

Anti defection: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ!

BRS MLAs Disqualification case: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పదిమంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరుగనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు మూడు వేర్వేరు పిటిషన్లు విచారణకు రానున్నాయి.

- Advertisement -

అసలేం జరిగిందంటే: బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు (జులై 31 నాటికి) నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం గతంలో ఆదేశించింది. అయితే వివిధ కారణాల వల్ల నిర్ణయం తీసుకోవడం స్పీకర్‌ కార్యాలయానికి సాధ్యం కాలేదు. దీంతో స్పీకర్‌కు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు సీజేఐ ధర్మాసనం ముందు.. 14వ నంబరులో విచారణకు రానుంది.

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లు: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైనందున.. నేరుగా న్యాయస్థానమే తమ పిటిషన్లపై విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని కోరుతూ కేటీఆర్‌ మరో రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ మూడు పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం ఒకేసారి విచారణ చేపట్టి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News