CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు సీఎం బయల్దేరతారు. శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం.. రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు.
900 మంది పోలీసులతో పటిష్ట భద్రత: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని బజార్‌హట్‌నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో సుమారు 900 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలు:
- ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరతారు.
- ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
- 11:10 నుంచి 12:10 వరకు బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.
- మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తారు.
- మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు బయల్దేరతారు.
- 2.20 నుంచి 2.30 వరకు పిప్రి గ్రామంలోని వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
- 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
- 4.20 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

