Gandhi Bhavan: రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నేడు గాంధీ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏఐసీసీ ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మరియు కీలక నేతలు హాజరుకానున్నారు.
సమావేశంలోని ప్రధాన అంశాలు: మున్సిపల్ ఎన్నికల గెలుపే ధ్వేయంగా ప్రతి వార్డు మరియు డివిజన్ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లతో ప్రాథమిక జాబితాను రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. వీరిలో సమర్థులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించి, ప్రజాదరణ ఉన్న వారికే టికెట్లు కేటాయించనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం పేరులో ‘గాంధీ’ పేరు తొలగింపుపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. అంతేకాకండా కృష్ణా, గోదావరి జలాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అప్రమత్తమైన అధికార పక్షం: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడంపై అధికార పక్షం అప్రమత్తమైంది. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికార పక్షం వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
సంస్థాగత మార్పులు: జిల్లా కార్యవర్గాల జాబితాను ఈరోజు సాయంత్రం లోపు సమర్పించాలని డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. అలగే ఈ నెల 15వ తేదీ నాటికి మండల అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

