HomeTop StoriesEkadashi: నేడే తొలి ఏకాదశి.. యోగనిద్రలోకి శ్రీమహావిష్ణువు!

Ekadashi: నేడే తొలి ఏకాదశి.. యోగనిద్రలోకి శ్రీమహావిష్ణువు!

Ekadashi festival: హిందూ సంప్రదాయంలో తొలి పండుగగా భావించే పవిత్రమైన ‘తొలి ఏకాదశి'(శయని ఏకాదశి) వేడుకలకు వేళయింది. ఆషాఢ మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజున వచ్చే ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. సంవత్సరం పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో దీనికి అత్యంత విశిష్ట స్థానం ఉంది.

- Advertisement -

యోగనిద్రలోకి శ్రీమహావిష్ణువు: ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సాగే ఈ నాలుగు నెలల కాలాన్ని ‘చాతుర్మాస వ్రతం’ అంటారు. ఈ కాలంలో భక్తులు జపాలు, ధ్యానాలు, ఉపవాసాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. ఈ రోజున చేసే విష్ణు పూజ, దానధర్మాలు సమస్త పాపాలను హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

పేలాల పిండి ప్రసాదం వెనుక ఆరోగ్య రహస్యం: తొలి ఏకాదశి అనగానే టక్కున గుర్తువచ్చేది ‘పేలాల పిండి’ ప్రసాదం. జొన్న పేలాలను బెల్లం, యాలకులు, మిరియాల పొడితో కలిపి దంచి శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆచారం వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. వర్షాకాలం ఆరంభంలో వాతావరణ మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడటం, జలుబు వంటి సమస్యలు రావడం సహజం. జొన్నలు జీర్ణక్రియను మెరుగుపరచగా, బెల్లం శక్తిని, మిరియాలు కఫం నుంచి రక్షణను అందిస్తాయి. మన పూర్వీకులు ప్రతి ఆచారం వెనుక గొప్ప ఆరోగ్య సూత్రాలను ముడిపెట్టారనడానికి ఇది నిదర్శనం.

రైతన్నల తొలి పండుగ: గ్రామీణ ప్రాంతాల్లో తొలి ఏకాదశిని రైతులు తమ తొలి పండుగగా, వ్యవసాయ పనుల ప్రారంభానికి శుభసూచకంగా భావిస్తారు. వర్షాకాలం మొదలయ్యే ఈ సమయంలో నేలతల్లికి, విష్ణుమూర్తికి పూజలు చేసి ఏరువాక సాగిస్తారు. పాడిపంటలతో ఇళ్లన్నీ కళకళలాడాలని కోరుకుంటూ భక్తులు రోజంతా ఉపవాసం, రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలు నిర్వహిస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మిక నిష్ఠను, ఆరోగ్యాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని చాటే అపురూప పండుగే తొలి ఏకాదశి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News