BJP 47th Foundation Day: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దేశవ్యాప్తంగా వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర నాయకత్వం పలు కీలక సూచనలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ఇంటింటికీ బీజేపీ: బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. ఇది జాతీయ సేవ, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన ఒక మహత్తర జాతీయ ఉద్యమని రాంచందర్ రావు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యజమానుల అనుమతితో వారి ఇళ్లపై పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.
Also read-Gajwel Bandh: నేడు గజ్వేల్ బంద్.. రోడ్లపైకి వచ్చిన గులాబీ శ్రేణులు!
జనసంఘ్ నుండి పార్టీ ప్రస్థానం: గతంలో జనసంఘ్‌గా ప్రారంభమైన బీజేపీ ప్రయాణం 1980 ఏప్రిల్ 6న ముంబై వేదికగా అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా అవతరించింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల కష్టం, సిద్ధాంత బలం వల్లే నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వర్గాలు కోరాయి.

