Mandamelige festival: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు అంకురార్పణ జరుగుతోంది. జాతరలో అత్యంత కీలకమైన ఘట్టంగా భావించే “మండమెలిగే పండుగ”ను పూజారులు ఈరోజు (బుధవారం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకతో మేడారంలో జాతర వాతావరణం పూర్తిస్థాయిలో సంతరించుకుంది.
గిరిజన ఆచారంతో అష్టదిగ్బంధనం తంతు: వనదేవతల కొలువు దీర్చే గద్దెల వద్ద పూజారులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో వనదేవతల పూజా సామాగ్రిని భక్తిశ్రద్ధలతో శుద్ధి చేయనున్నారు. జాతర ప్రశాంతంగా సాగాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని కోరుకుంటూ మేడారం పరిసరాల్లో ‘అష్టదిగ్బంధనం’ తంతును గిరిజన ఆచారాలతో పూజారులు పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేయనున్నారు.
Also read-Medaram: మేడారం మహాజాతరలో తొలి అంకం షురూ.. భక్తిశ్రద్ధలతో ‘గుడి మెలిగే’ పండుగ!
ప్రత్యేక పూజలు: ఇవాళ, రేపు (రెండు రోజుల పాటు) అమ్మవార్లకు అత్యంత నిష్టతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా మేడారానికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ కీలక ఘట్టాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం: పూర్వం ప్రస్తుతం ఉన్న దేవాలయాల స్థానాల్లో గుడిసెలుండేవి. రెండేళ్లకోసారి మహా జాతర నిర్వహించే సమయానికి అవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. అలా గుడిమెలిగే.. జాతరకు వారం ముందు మండ మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు మండ మెలిగే తంతు నేపథ్యంలో మేడారం ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిపోయింది.

