Budget meeting: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రెండున్నరేండ్లలో ఎగ్గోట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు అన్నట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతుందని అన్నారు. అంతేకాకుండా రేవంత్ సర్కార్ ఆల్‌టైం రికార్డు స్థాయిలో అప్పులు చేసిందని తేలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను.. అధికారం చేపట్టాక గాలికొదిలిందని అన్నారు. 420 వరల్డ్ కప్ పెడితే కాంగ్రెసే గెలుస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో సటైర్లు వేశారు.
సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఏమైంది?: 2023 గవర్నర్ ప్రసంగంలో హామీల దస్త్రంపై సీఎం సంతకం చేసినట్లు పేర్కొన్నారు.. కానీ ఏళ్లు గడిచినా ఆ సంకల్పం, చిత్తశుద్ధి ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. బహిరంగ వేదికపై సంతకం చేసిన ఆ దస్త్రం మాయమైందా? లేక మీరే మాయం చేశారా చెప్పాలని అన్నారు. ఆ ఫైల్ ఆచూకీ కోసం వెంటనే సిట్ (SIT) ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read-Jagtial: కాంగ్రెస్‌లో ఇక ఉండలేను.. పార్టీ మార్పుపై జీవన్‌రెడ్డి క్లారిటీ!
చట్టబద్ధత ఏది?: తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఆరు గ్యారింటీల హామీల విషయంలో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

