Tuesday, December 9, 2025
HomeTop StoriesCabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయానికి అవకాశం!

Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయానికి అవకాశం!

Telangana cabinet meeting: స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేయడంతో.. నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్​ సమావేశం సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి.. ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకుంటామని ఇదివరకే సీఎం ప్రకటించారు. దీంతో నేడు జరిగే మంత్రివర్గ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. ఎన్నికల నిర్వహణపై మరింత ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినేట్ సమావేశం కానుంది. ఎన్నికల విషయంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి.. నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదే ఊపులో వెళ్లాలి: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినందున ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికలకు సైతం వెళ్లాలని కొందరు మంత్రులు ఇప్పటికే రేవంత్‌ రెడ్డిని కోరినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని గతంలో కాంగ్రెస్‌ టీపీసీసీ అన్నారు. అయితే ఇదే అంశంపై హైకోర్టులో కేసు విచారణ పెండింగులో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. హైకోర్టులో రిజర్వేషన్ల అంశం విచారణలో ఉన్నందున.. చట్ట ప్రకారం అధికారికంగా అమలు వెంటనే వీలుకాకపోతే పార్టీపరంగా 42% రిజర్వేషన్ల అమలు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కొందరు పార్టీ పెద్దలు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై నేటి మంత్రివర్గంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఆలోచిస్తుంది.

Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-governments-good-news-for-indiramma-housing-beneficiaries/

1 నుంచి విజయోత్సవాలు: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి తెలంగాణవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ –2025 నిర్వహణ, డిసెంబర్‌ 8న ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవం నిర్వహణ, డిసెంబర్‌ 9న తెలంగాణ రైజింగ్‌–2047 పాలసీ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ జరపాలని రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికే నిర్ణయించింది. వీటి నిర్వహణ తీరుతెన్నులపై నేడు జరిగే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలపై సైతం మంత్రివర్గంలో నేడు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో అభిప్రాయం, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి లభించిన మద్దతు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సైతం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News