HomeTop StoriesElections: నేడే తొలి విడత పల్లె పోరు.. ఒంటి గంట వరకు పోలింగ్‌.. అనంతరం ఓట్ల...

Elections: నేడే తొలి విడత పల్లె పోరు.. ఒంటి గంట వరకు పోలింగ్‌.. అనంతరం ఓట్ల లెక్కింపు!

panchayat elections: తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 3,834 సర్పంచి.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 37,562 పోలింగ్‌ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు తొలివిడతలో భాగంగా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచిని ఎన్నుకుంటారు.

- Advertisement -

సర్పంచి పదవులకు సగటున 3.38 మంది పోటీ: గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలో నిలిపాయి. దీంతో సర్పంచ్‌ అభ్యర్థులకు అండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలి విడతలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు…. 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. అయితే వీటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. అంతే కాకుండా 396 సర్పంచి పదవులతో పాటుగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామపంచాయతీ సర్పంచి, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు వివిధ కారణాల రిత్యా స్టే విధించాయి. దీంతో నేడు 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు… 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. సర్పంచి పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని తెలిపారు..

పకడ్బందీగా ఏర్పాట్లు.. భారీగా నగదు, మద్యం సీజ్: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. 50 వేల మంది సివిల్‌ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్‌లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) ఉల్లంఘనపై ఇప్పటివరకు 3,214 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా తెలిపారు. వివిధ సెక్షన్ల కింద 31,428 మందిని బైండోవర్‌ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అన్నారు. రూ.1,70,58,340 నగదుతో పాటు రూ.2,84,97,631 విలువైన మద్యం, రూ.12,15,500 విలువైన ఆభరణాలు, మరో రూ.64,15,350 విలువైన సామగ్రి కలిపి మొత్తం రూ.7,54,78,535 సీజ్‌ చేసినట్లుగా తెలిపారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-panchayat-elections-2025-bizarre-campaign-tactics/

టెలిపోల్‌ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్‌లు: కమిషన్‌ రూపొందించిన టెలిపోల్‌ యాప్‌ నుంచి ఓటర్లు తమ ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని పేర్కొన్నారు. అంతే కాకుండా కమిషన్‌ 9240021456 టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కమిషనర్‌ కోరారు. పోలింగ్‌ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేయించినట్లు తెలిపారు. స్థానికంగా సెలవు దినంగా సైతం ప్రకటించినట్లుగా పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News