Zero Shadow Day: భాగ్యనగర వాసులకు ఈరోజు ఒక అరుదైన ఖగోళ అనుభవం ఎదురుకానుంది. శనివారం మధ్యాహ్నం సరిగ్గా 12:12 గంటలకు కొద్దిసేపు మీ నీడ మీకు కనిపించకుండా మాయం కానుంది. దీనినే ఖగోళ శాస్త్రవేత్తలు జీరో షాడో డే (Zero Shadow Day ) అని పిలుస్తారు.
అసలెందుకు నీడ కనపించదంటే?: సాధారణంగా ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మన వెంటే ఉంటుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు సూర్యుడు సరిగ్గా మన నడినెత్తి మీదకు చేరుకుంటాడు. దీనివల్ల సూర్యకిరణాలు నిలువుగా (90 డిగ్రీల కోణంలో) భూమిని తాకుతాయి. ఫలితంగా ఏ వస్తువు నీడ అయినా సరే.. ఆ వస్తువు అడుగు భాగంలోకే పడిపోతుంది. దీంతో నీడ పక్కకు కనిపించకుండా మాయమైనట్లు భ్రమ కలిగిస్తుంది.
అసలెందుకు నీడ కనపించదంటే?: ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఈ మార్పులు సంభవిస్తాయి. సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశల్లో కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న నగరాల్లో ఏడాదికి రెండుసార్లు జీరో షాడో డే ఏర్పడుతుంది. మీరూ ఈ వింతను పరీక్షించాలనుకుంటే.. మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో బయట ఒక ఖాళీ ప్రదేశంలో నిలపడి ఉంటే.. నీడ మాయమవ్వడాన్ని మీరు స్పష్టంగా గమనించవచ్చు.

