Jagga Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు వ్యతిరేకంగా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించారు. జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోతిరెడ్డిపల్లి జంక్షన్‌కు చేరుకుని రహదారిపై బైఠాయించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా నేతలు నిరసన కొనసాగించారు. రహదారిపై టైర్లు తగలబెట్టి.. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎత్తున నినాదాలు చేశారు.
భారీగా ట్రాఫిక్ జామ్: సుమారు గంటకు పైగా సాగిన ఈ మెరుపు ధర్నాతో హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆందోళనను విరమింపజేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోతిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read-Rahul Gandhi : యువతపై లాఠీల విరుచుకుపాటు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్!
జగ్గారెడ్డి అరెస్ట్: పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలోకి తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు అతికష్టం మీద కార్యకర్తలను పక్కకు తప్పించి, జగ్గారెడ్డిని సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

