Mumbai: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న కుంభవృష్టి వానలతో అష్టదిగ్బంధనమైంది. మూడు వైపులా సముద్రపు నీరుండే ముంబయి నగరం.. వర్షాల కారణంగా నాలుగో వైపున కూడా మిగిలిన ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోవడంతో పూర్తిగా ఒక ద్వీపంలా మారిపోయింది.
రహదారులు బంద్.. రైళ్లకు బ్రేక్: వర్షాల దాటికి ముంబయి-పుణె, ముంబయి-అహ్మదాబాద్, ముంబయి-కొంకణ్ ప్రధాన రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు నగర జీవనాడి అయిన లోకల్ మరియు దూరప్రాంత రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మిస్సింగ్ లింక్’ బైపాస్ మార్గంలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణ సమయాన్ని 20 నుండి 30 నిమిషాలు తగ్గించేందుకు 13.3 కిలోమీటర్ల పొడవుతో, రెండు భారీ సొరంగాలు (1.6 కి.మీ, 8.9 కి.మీ) మరియు 183 మీటర్ల కేబుల్ బ్రిడ్జితో ఈ అత్యాధునిక బైపాస్‌ను నిర్మించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ సరికొత్త సొరంగ మార్గాన్ని కేవలం 9 వారాల కిందటే ప్రారంభించారు. అయితే సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి సొరంగం సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Also read-Heavy rains: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు!
18 గంటల పాటు సహాయక చర్యలు: కొండచరియలు విరిగిపడటంతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సుమారు 18 గంటల పాటు శ్రమించి శిథిలాలను తొలగించి, మార్గాన్ని పునరుద్ధరించాయి. మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని, రానున్న 24 గంటల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

