HomeTop StoriesTrue love: భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె సమాధి పక్కనే తనకూ నిర్మించుకున్న భర్త!

True love: భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె సమాధి పక్కనే తనకూ నిర్మించుకున్న భర్త!

True love: జీవితాంతం కష్టసుఖాలను పంచుకున్న భాగస్వామి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేక.. భార్యపై ప్రేమను చాటుకోవడానికి కడప జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె సమాధి పక్కనే తనకూ సమాధిని నిర్మించుకున్నాడు.

- Advertisement -

చనిపోయినా నీ నీడనై ఉంటా.. నీ పక్కనే విశ్రమిస్తా: కడప నగరంలోని కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన పి.రామమోహన్‌రాజు పీఎఫ్‌ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసి 2016లో పదవీ విరమణ చేశారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి ఏపీ రాష్ట్ర వైద్య, విద్య సహాయ సంచాలకులుగా (AD) విధులు నిర్వర్తించారు. 1978లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. వారిని ఉన్నత చదువులు చదివించి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక వివాహాలు చేశారు. ఇలా ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో 2011లో తీవ్ర విషాదం నిండింది. రాజ్యలక్ష్మి క్యాన్సర్‌ బారిన పడి కన్నుమూశారు. దీంతో నలుగురు కుమార్తెలే తల్లి పాడె మోసి.. కడప మాసాపేటలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

భార్య పక్కనే సమాధి: భార్య మరణంతో రామమోహన్‌రాజు ఒంటరివాడయ్యారు. ఎలాగైనా మరణానంతరం తన భార్య చెంతనే ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం శ్మశానవాటిక నిర్వాహకులను సంప్రదించి.. తన భార్య సమాధి పక్కనే కొంత స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరారు. వారు అంగీకరించడంతో తన సొంత ఖర్చులతో స్వయంగా అక్కడ తన కొరకు ఒక సమాధిని నిర్మించుకున్నారు. తాను మరణించిన తర్వాత తన మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలని నలుగురు కుమార్తెలను ఒప్పించారు.

అంత్యక్రియల కోసం ముందే ఏర్పాట్లు: కేవలం సమాధి నిర్మించుకోవడమే కాకుండా తన అంత్యక్రియల ఖర్చుల కోసం తన పెన్షన్ డబ్బుల నుండి రూ. 4 లక్షలను కుమార్తెలకు అప్పగించారు. అంతేకాదు తన అంత్యక్రియలను ఒక వేడుకలా జరిపించాలని కోరుతూ.. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తన ఇద్దరు స్నేహితులకు సైతం చెరో రూ. 50 వేలను ముందే అందజేయడం విశేషం. భార్యపై ఆయనకున్న అమరప్రేమకు, ఆత్మీయతకు ఈ వినూత్న నిర్ణయం అద్దం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News