Jnaneswari: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసులో ఓ ‘అనుమానాస్పద కారు’ తీవ్ర కలకలం రేపుతోంది. పాప అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారే, ఇప్పుడు నర్సీపట్నం వద్ద చిన్నారి బంధువును ఢీకొట్టిందనే ఆరోపణలు వినపిస్తున్నాయి.
గోడప్రతులు అంటిస్తుండగా ప్రమాదం: చిన్నారి జాను అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాప సమాచారం కోసం పోస్టర్లు ముద్రించి వివిధ ప్రాంతాల్లో అతికిస్తున్నారు. ఈ క్రమంలో జానుకు వరుసకు తాత అయ్యే కోటేశ్వరరావు మరో వ్యక్తితో కలిసి ఆదివారం మధ్యాహ్నం నర్సీపట్నం పరిసరాల్లో పోస్టర్లు అంటిస్తున్నారు. మాకవారిపాలెం సమీపంలో వీరు పనిచేస్తుండగా.. ఒక కారు వచ్చి కోటేశ్వరరావును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, సదరు కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. “పాప అదృశ్యమైన రోజున మా గ్రామంలోని ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఓ కారు అనుమానాస్పదంగా తిరగడం రికార్డయ్యింది. ఇప్పుడు నన్ను ఢీకొట్టి పరారైన కారు కూడా అదే!” అని బాధితుడు కోటేశ్వరరావు తెలిపారు.
Also read-Kakinada: అదృశ్యమై నెల.. అయినా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ!
అలర్ట్ అయిన పోలీసులు: బాధితుడి ఆరోపణలతో తుని రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు ఢీకొన్న ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు. అయితే ఈ కారు వ్యవహారంపై తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరరావు వివరణ ఇస్తూ.. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారును సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే గుర్తించామని తెలిపారు. గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి ఆ కారులో కొందరు వచ్చారని, చిన్నారి అదృశ్యానికి, ఆ కారుకు ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తేలిందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జాను తండ్రి గణేష్‌కు గతంలో ఒక కారు విషయంలో కొందరితో వివాదం నడిచింది. ఆ తర్వాత ఆ సమస్య సమసిపోయినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ కారు రూపంలోనే ప్రమాదం జరగడం, బంధువులు నేరుగా ఆరోపణలు చేస్తుండటంతో ఈ అదృశ్యం కేసు పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

