Chevella Bus Accident updade: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును భారీ కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొనడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. టిప్పర్ వేగంగా వస్తూ నియంత్రణ కోల్పోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఢీ కొట్టిన ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, కంకర లోడ్ నేరుగా బస్సుపై పడింది. బస్సు లోపలి ప్రయాణికులు ఎవరూ బయటపడలేక తీవ్రంగా గాయపడ్డారు. సహాయక బృందాలు వెంటనే చేరి బస్సు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టాయి.
ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన దంపతులు బందప్ప, లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు భవానీ, శివలీల మాత్రం గాయాలతో ఎట్టకేలకు బయటపడ్డారు. అయితే ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించటం వారిని అనాథలుగా మార్చేసింది. కళ్లముందే మృత్యువు తల్లిదండ్రులను కబళించటంతో వారు షాక్ కి గురయ్యారు. జీవితం ఒక్కసారిగా తలకిందులు కావటంతో తల్లిదండ్రుల మృతదేహాల పక్కన పిల్లలు ఏడుస్తుండటం చూసిన వారందరినీ కలచి వేస్తోంది.
ప్రమాద సమాచారాన్ని అందుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారి బృందంతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆయన బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి రూ.2లక్షలు అలాగే గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందించనున్నట్లు ఎక్స్ వేదికగా చెప్పారు.
గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ వెల్లడించారు. ప్రమాద విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎక్స్‌ప్రెస్ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో తాండూరు, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో గాఢ విషాదం నెలకొంది.


