HomeTop StoriesTuni child case: తుని చిన్నారి అదృశ్యం కేసులో ఊహించని ట్విస్ట్.. రంగంలోకి పెంపుడు శునకం!

Tuni child case: తుని చిన్నారి అదృశ్యం కేసులో ఊహించని ట్విస్ట్.. రంగంలోకి పెంపుడు శునకం!

Tuni child case: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్‌ అగ్రహారంలో నాలుగురోజుల క్రితం అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన నాలుగు రోజుల అనంతరం.. ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు శునకం అకస్మాత్తుగా తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.

- Advertisement -

నాలుగు రోజుల తర్వాత ఇంటికి పెంపుడు శునకం: గత శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది. ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వందలాది బృందాలుగా విడిపోయి జల్లెడ పడుతున్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆ పెంపుడు శునకం ఒంటరిగా తోటలోని యజమాని ఇంటికి వచ్చింది. తీవ్ర ఆందోళనతో ఉన్న ఆ శునకం.. చిన్నారి తల్లి భవానీపై దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అనంతరం ఆమె చున్నీని నోటితో బలంగా లాగి.. తిరిగి కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. కుక్క ప్రవర్తనను బట్టి చిన్నారి ఎక్కడో ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని భావించిన పోలీసులు.. వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. రాత్రి వరకు కొండ ప్రాంతంలో గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు.

Also read-Bengaluru: అమ్మతనానికే మచ్చ.. ప్రియుడి మోజులో కూతురిని చంపిన తల్లి!

ఇనుప కంచెకు చిన్నారి వస్త్రాల పోగులు: ప్రస్తుతం ఈ కేసులో పెంపుడు శునకమే కీలక ఆధారంగా మారడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఎవరైనా చిన్నారిని అపహరించి ఉంటే.. శునకం ఇన్ని రోజులు అక్కడే ఎందుకు ఉంటుంది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి తోట లేదా కొండ ప్రాంతంలోనే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. శునకం రాత్రి వేళ మళ్లీ తోటలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. ఆ ప్రాంతంలోకి ఎవరినీ రాకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు, ఇంటి సమీపంలోని ఇనుప కంచెకు చిన్నారి వస్త్రాల పోగులు, కుక్క వెంట్రుకలు కనిపించాయని తల్లి చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపారు.

కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి వీడియోలు: అదృశ్యమవడానికి ముందు చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన చిన్నారి చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ “అమ్మా పాలివ్వు” అంటూ ఆ పాప పలికిన ముద్దుముద్దు మాటల వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని వేలాది మంది ప్రార్థిస్తున్నారు.

Also read-Arunachalam: అరుణాచలంలో అమానుషం.. గిరిప్రదక్షిణ దారిలో సామూహిక అత్యాచారం!

దర్యాప్తునకు శాపంగా మారిన సీసీ కెమెరాల కొరత: సీహెచ్‌ అగ్రహారం ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు పెద్ద సవాలుగా మారింది. దీంతో సాంకేతిక ఆధారాల కోసం గ్రామస్థుల ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అనుమానితులు, బయటి వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టారు. డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సీఐలు చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, శ్రీనివాస్, ఎస్సైలు కృష్ణమాచార్యులు, రామకృష్ణ సహా భారీ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News