Union Minister Bandi Sanjay: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతుల కన్నీళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రమే నిధులిస్తుంటే నిర్లక్ష్యం ఎందుకు?: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తున్నా.. రేవంత్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని కొనడం లేదని ప్రశ్నించారు. ప్రతి గింజ కొనుగోలుకు కేంద్రమే పైసలు ఇస్తోందని అన్నారు. సుతిలీతాడు, దబ్బడం, రవాణా ఛార్జీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా కేంద్రమే చెల్లిస్తోంది.. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బండి సంజయ్ అన్నారు.
Also read-Telangana: రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో జొన్నల పంపిణీ!
దిల్లీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు కనీసం 16 లక్షల టన్నులు కూడా కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రికి దిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదు. రైతులు పడుతున్న బాధలను ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం శోచనీయం” అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర (MSP) చెల్లించి ప్రభుత్వమే సేకరించాలని కోరారు.

